సినిమాలో సాహస సీన్లు చూస్తుంటాం. కానీ ఆ సీన్లు నిజ జీవితంలో చేయడం చాలా కష్టం. కానీ నిజజీవితంలోనూ మనకు సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి సాహసాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని సంఘటనలు ఈ లోకంలోని మానవుల్లోని ఔచిత్యాన్ని, మానవత్వాన్ని పట్టి చూపిస్తాయి. వారిలోని సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. పంజాబ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి.. మూగజీవి ప్రాణాలను రక్షించాడు. తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో నీటితో నిండిపోయిన ఓ రహదారిపై ఓ ఆవు నడుచుకుంటూ వచ్చి.. ఓ తడచిన విద్యుత్ స్తంభాన్ని తాకింది. దాంతో కరెంటు షాక్‌కు గురై కొట్టుకుంది. నొప్పితో విలవిల్లాడిపోయి.. కింద పడిపోయింది.
పక్క షాపు అతను ఆవు కొట్టుకోవడం చూసి.. పరుగెత్తుకుంటూ నీట్లోకి దూకాడు. ఓ గుడ్డతో ఆవును కాళ్లను కట్టి.. గట్టిగా స్తంభం దగ్గర నుంచి లాగాడు. స్థానికంగా ఉన్న మరోవ్యక్తి ఆవును లాగడానికి సాయం చేశాడు. అలా అలా దాని ప్రాణాలను కాపాడాడు. కొద్దిసేపటికి ఆ ఆవు షాక్ నుంచి తేరుకుని, లేచి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లక్షకుపైగా లైక్స్ వచ్చాయి. 1.2 మిలియన్ల మంది చూశారు.
ఆ షాపు అతనిని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆవు ప్రాణాలను రక్షించడంలో ఆ వ్యక్తి ధైర్యంగా, దయతో వ్యవహరించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరొక యూజర్ కరెంట్ షాక్‌కు గురైన ఆవును రక్షించాడు. మానవత్వం అంటే ఇదే.. అని కామెంట్ పెట్టారు.