వీఐపీల కేసులు విషయంలో ప్రతిసారి అత్యుత్సాహం చూపే పోలీసులు మరోమారు అలాంటి చర్యలకు పాల్పడి అబాసుపాలవుతున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఫోన్ చోరీకి గురైంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీ ఫోన్ మిస్సైనట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందంటూ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా మంగళవారం ఉదయం తాను విమానాశ్రయంలో గాడాలకు చెందిన పారిశ్రామికవేత్త శిరీషతో సెల్ఫీ దిగానని.. ఆ తర్వాత ఫోన్ కనిపించలేదని భరత్ తెలిపారు. ఎంపీ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న కోరుకొండ పోలీసులు విచారణ చేపట్టారు.
ఎంపీ ఫిర్యాదులో ప్రస్తావించిన సునీత ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. మధ్యాహ్నం సమయంలో కోరుకొండ ఎస్సై తనకు ఫోన్ చేసి ఉదయం ఎక్కడ ఉన్నారని అడిగారని.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అడగ్గా బయట ఉన్నానని చెప్పానన్నారు. దీంతో వాట్సప్‌లో ఆయన తన లొకేషన్ షేర్ చేయాలని అడిగారని.. కానీ తాను షేర్ చేయలేదన్నారు. ఏదైనా విచారణ కోసమా అని అడగ్గా సీఐని అడిగి ఫోన్ చేస్తానని చెప్పారన్నారు. కానీ ఎంపీ గారి ఫోన్ పోయిందని ఎస్సై తనకు చెప్పకుండా ఫోన్ పెట్టేశారన్నారు. ముందే ఆయన ఎంపీ గారి ఫోన్ పోయిందని చెబితే బాగుండేదన్నారు.
తన దగ్గర 6-7 మంది మహిళలు, ఒక డ్రైవర్ పని చేస్తాడని శిరీష తెలిపారు. ఏడుగురు పోలీసులు తన ఇంట్లోకి వచ్చారని.. ఎస్సై దురుసుగా మాట్లాడారని, రూల్స్ మొత్తం ఉల్లంఘించారని శిరీష ఆరోపించారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టం తీసుకొచ్చారు.. అలాంటిది పోలీసులే తనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే.. తాను దిశకు ఫోన్ చేయాలా..? లేదంటే ఎవరికి ఫోన్ చేయాలి? అని ఆమె వాపోయారు. ఈ ఘటనపై తాను సీఎం ఆఫీసుకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
‘ఎంపీ ఫోన్ పోతే పోలీసులు ఇంతలా రియాక్ట్ అయ్యారని.. మొన్ననే బ్రిడ్జి దగ్గర ఓ డెడ్ బాడీ లభ్యమైతే.. దానికి రియాక్షన్ లేదు.. రోజూ రేప్‌లు జరుగుతున్నాయి.. దానికీ రియాక్షన్ లేదు. కానీ ఎంపీ ఫోన్ పోతే నా బెడ్రూంలోకి వచ్చేసి.. వాడ్‌రోబ్‌లోని వస్తువులన్నీ పడేశారు. ఎస్సై చేసింది నూరు శాతం తప్పు. నోటీసులు లేకుండా ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాన’ని శిరీష హెచ్చరించారు.