వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ నేతల నుంచే వ్యతిరేకత వస్తోంది. తాజాగా ప్రభుత్వంలో భాగమైన ఓ మంత్రి సైతం ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టారు. మంత్రి దాడిశెట్టి రాజా వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గత పరిపాలనలో జన్మభూమి కమిటీలు చూశాం.. మన ప్రభుత్వం వచ్చింది మన కష్టాలు తీరతాయని కార్యకర్తలు ఊహించుకున్నారు. కానీ పూర్తిగా నిరాశే ఎదురైంది. ఎందుకంటే మన వెనుకాల.. మనం పెట్టిన వాలంటీర్లు ఉన్నారు. వాళ్లు మనం పెట్టిన చిన్న బచ్చాగాళ్లోంటోళ్లు. ఈ బచ్చాగాళ్లు మన మీద పెత్తనం చేస్తున్నారు.. మనం ఏం చేయలేకపోతున్నామనే భావనలో ఉన్నార’ని వైఎస్సార్సీపీ నేత వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామానికి సచివాలయ వ్యవస్థ అనేదే సీఎం జగన్ పాదయాత్రలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
‘కార్యకర్తలారా.. నాయకులారా.. ఒక్కటైతే చెబుతున్నాను.. ఈ పార్టీకి జగన్ తయారు చేసిన జెండా.. ఆ జెండా పట్టుకొని తిరిగే మీరు శాశ్వతం. మేం శాశ్వతం కాదు.. ఈ పార్టీ మీది’ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.
ఇటీవలే మంత్రి అంబటి రాంబాబు సైతం వాలంటీర్ల వ్యవస్థపై స్పందించారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా.. పార్టీకి సమాచారం అందజేసే సైనికులంటూ.. అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లను తీసేస్తామన్నారాయన. వాలంటీర్లను మనమే నియమించాం.. అంటూ గతంలోనూ చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు.