బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది.ఈ రోజు ఆయన రాజీనామా చేయవచ్చని యూకే మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పార్టీ అధినేత పదవి నుంచి తప్పుకొనేందుకు ఆయన అంగీకరించారు. ఒక వేళ రాజీనామా చేస్తే.. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకొన్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికారిక నివాసంలో పార్టీ చేసుకున్నందుకుగానూ ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకొంది. వీటన్నింటి మధ్య ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. సొంత మంత్రులే ఆయన దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన మంత్రుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ పదవి నుంచి జాన్సన్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా.. బుధవారం మరో 15 మంది మంత్రులు పదవులను వీడారు. ఇప్పటివరకూ 40 మందికి పైగా మంత్రులు తమ పదవుల నుంచి దిగిపోయారు. 36 గంటల క్రితం బోరిస్ నియమించిన ఇరాక్ జాతీయుడైన నదిమ్ జహావి (ఆర్థిక మంత్రి) కూడా ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేశారు. 'వెళ్లిపోవడమే ఇప్పుడు మీరు చేయాల్సిన సరైన పని'అని వ్యాఖ్యానించారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకొన్నారు. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు గానూ ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. 2019లో ప్రధాని జాన్సన్... క్రిస్ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్ పట్టించుకోకుండా క్రిస్ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల క్రిస్ ఒక క్లబ్‌లో తాగిన మత్తులో ఇద్దరు వ్యక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇది మంత్రులు, ఉన్నతాధికారుల రాజీనామాలకు దారితీసింది.