నవరత్నాలపై నవ సందేహాల పేరుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. 64 లక్షల మందికి మేలంటూ.. 50 లక్షల మందికే రైతుభరోసా నిజం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో 3 వేల మంది కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆర్థిక సాయాన్ని మాత్రం 700 మందికే పరిమితం చేయలేదా అని నిలదీశారు. అమ్మఒడిని 43 లక్షల మందికే ఇచ్చి..83 లక్షల మందికి ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం ఎందుకు చేశారని దుయ్యబట్టారు. ఐదు లక్షల పింఛన్లు తొలగించిన మాట వాస్తవం కదా అని అడిగారు. మద్యంపై ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లని.. 2021-22లో రూ.22 వేల కోట్లకు చేరిందన్నారు. ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా అని నిలదీశారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయని అడిగిన పవన్… సీఎంఆర్‌ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రీయింబర్స్‌మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్ధులకు హాల్‌టిక్కెట్లు ఆపేస్తున్న మాట నిజం కదా? అని నిలదీశారు. పీజీ విద్యార్ధులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారని అడిగారు. చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? అన్న పవన్....ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. పొదుపు సంఘాల సంఖ్య ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారని నిలదీసిన పవన్... అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయో చెప్పాలన్నారు.