చనిపోయిన వ్యక్తికి బదులుగా తన ఫోటో వేయడం ఏమిటీ అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్రొడ్యూసర్ చనిపోతే.. ఆయన ఫోటో బదులు తన ఫోటోను పోస్ట్ చేయడంపై స్పందించారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను అందించే క్రమంలో కొందరు చిన్న పొరపాటు చేశారు. ప్రొడ్యూసర్ గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ బదులు.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోటోను వాడేశారు.
రాజేంద్ర ప్రసాద్, బుచ్చయ్య ఇంటి పేర్లు గోరంట్ల కావడంతో చిన్న తప్పు జరిగింది. కొద్దిసేపటికి కొంతమంది నెటిజన్లు జరిగిన తప్పును గమనించి అప్రమత్తం చేయడంతో ఫోటోను మార్చేశారు. కానీ అప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సుపరిచతమైన వ్యక్తి.. సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఫోటో గురించి కూడా తెలియదా అంటూ విమర్శలు వచ్చాయి. ఈ విషయం బుచ్చయ్యకు తెలియడంతో ట్విట్టర్ వేదికగా సీరియస్‌గా స్పందించారు.
‘నమస్కారం.. కొంచం సంస్కారంతో తెలుగు సోషల్ మీడియా వ్యహరిస్తే బాగుంటుంది.. నీచ సంస్కృతికి దిగి..జనాల రీచ్ ల కోసం బ్రతికి ఉన్న వాళ్ళని నీచ మైన రోత రాతలతో చంపేయకండి.. మొత్తు నిద్ర పత్రిక ఎడిటర్లు బుద్ధి జ్ఞానం లేకుండా న్యూస్ వేస్తే ఇలాగే ఉంటుంది’ అంటూ తీవ్రంగా స్పందించారు. తన ఫోటోను వాడటంపై తీవ్రంగా స్పందించారు.