ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ ప్రాణాలను కాపాడిన వారిని సస్పెండ్ చేస్తారా: ఎంపీ రఘురామ ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 04:05 PM

ఒక ఎంపీ ప్రాణాలను కాపాడిన వారిని సస్పెండ్ చేస్తారా అంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఇప్పటికే న్యాయపోరాటం ప్రారంభించానని.. అది కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. తనకు కేంద్రం కల్పించిన భద్రతను తొలగించే విధంగా సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తన ప్రాణాలను కాపాడితే.. వారిని సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలొడ్డిన వారిపై, దేశద్రోహి అని ముద్ర వేసినట్టుగా పోలీసు అధికారుల చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఉంగరాన్ని కొట్టేస్తారా అంటూ ప్రశ్నించిన ఆయన తనను చంపడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం కూడా పోలీసు విధులకు భంగం కలిగించినట్లేనా అంటూ ప్రశ్నించారు. తన ఇంటి దగ్గర నంబర్ లేని వాహనంపై వచ్చి అనుమానస్పదంగా తిరుగుతుంటే.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. అతడి వివరాల గురించి ఆరా తీసినప్పుడు.. పోలీస్ కానిస్టేబుల్‌ని అంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఐడి కార్డ్ చూపించాల్సిందిగా కోరగా.. ఐడి కార్డ్ లేదని మీడియా ముందు మొహం దాచుకున్నాడన్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసులకు అప్పగించారన్నారు.


సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు, సంఘటన స్థలంలో లేని వారిపై కూడా పోలీసు కేసులు నమోదు చేశారన్నారు రఘురామ. తాను ఒక ఎంపీనని తనకు ప్రశ్నించే హక్కు ఉందని.. ఇక సీఆర్పిఎఫ్ జవాన్ల మీద తప్పుడు కేసు నమోదు చేసి, కేసు నమోదయిందన్న కారణంగా ఇద్దరు జవాన్లను సస్పెండ్ చేసినట్లుగా ఓ పత్రిక కథనాన్ని ప్రచురించిందన్నారు.


గత 30 నెలలుగా తనని నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి తనను అడ్డుకుంటున్న విధానాన్ని ఆ లేఖలో వివరించానన్నారు. తనపై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం చేశారని.. పార్లమెంటు సెషన్స్ ప్రారంభం కాగానే ప్రతి ఎంపీ ఇంటికి వెళ్లి కలిసి మద్దతు కోరుతానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఈ ఆపద సమయంలో తనకు అండగా నిలవాలని కోరారు. తాను కోరిన వెంటనే స్పందించి మదనపల్లిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రఘురామకృష్ణం రాజు ధన్యవాదాలు తెలియజేశారు. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడితే ఓదార్పుగా ఉంటుందన్నారు. మిగతా పార్టీల నాయకులు కూడా తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.


తాను తన భద్రతను దుర్వినియోగపరచానని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి జగన్ ఫిర్యాదు చేసినట్లుగా తనకు తెలిసిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. తనకు ప్రాణహాని జరిగితే బారికేడ్లు కూడా ప్రజలను నియంత్రించలేవని హెచ్చరించారు. తనకంతటి ప్రజా మద్దతు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన తనకు ఎదురైన కష్టాలను గురించి వివరిస్తూ సహచర పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల వారికి తమ ప్రాంతీయ భాషలతో పాటు, ఇంగ్లీషులో ఆ లేఖలను రాస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుర్మార్గుడి నుంచి ఉన్న ప్రాణహాని ఎదుర్కొంటున్నానని.. అతడికి పోలీసులు జత కలిశారని ఆ లేఖలో వివరించినట్లుగా వెల్లడించారు. అలాగే గత ఏడాది తనపై పోలీసు లాకప్ లో చేసిన హత్యాయత్నం గురించి వివరిస్తూ.. అప్పటి ఫోటోలను జతచేస్తూ రాజ్యసభ, లోక్ సభ సభ్యులకు లేఖలు రాస్తున్నట్లు చెప్పారు.


తమ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీలు ప్రజలు లేక వెలవెల పోతుంటే, మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడుకు మాత్రం స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు హాజరు అయ్యారన్నారు. బస్సులు పెట్టి, బిర్యానీ పొట్లాలను పంచినా ముఖ్యమంత్రి సభలకు, తమ పార్టీ ప్లీనరీలకు జనాలు మొహం చాటేస్తున్నారన్నారు. చివరకు ప్లీనరీ సభలో కూడా డ్వాక్రా మహిళలను అరువు తెచ్చుకోవలసిన దుస్థితి తమ పార్టీకి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ అవినీతి రుజువైతే పార్టీకి ఇబ్బందులు తప్పవని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు. ముఖ్యమంత్రి జగన్ కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోయినా పర్లేదని.. కానీ ఉన్న 8 వేల స్కూళ్లను మూసి వేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఒకవేళ ఎవరైనా పత్రికలో రాస్తే ఎదురు కేసులు, తమ వంటి వారు ప్రశ్నిస్తే గొడ్డును బాదినట్లుగా బాదుతారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com