మీరు ఎక్కడ నివసించాలని అనుకొంటున్నారు అన్న ప్రశ్నలకు ప్రపంచంలోని ప్రజలు ఠక్కున చెప్పిన పేరు కెనడా అట. ఫలాన చోట మేం నివసించాలి అనుకొంటున్నాం అన్న దేశాలలో జపాన్ రెండో స్థానంలో నిలవగా భారత్ ఎనిమిదో స్థానలో నిలిచింది. మన దేశం మనకు గొప్ప. భారత్ గురించి మనం అద్భుతం అని చెబుతాం. కానీ ప్రపంచ దేశాల ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది అనేది కీలకం. ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియాకి చెందిన ప్రైస్ కంపారిజన్ వెబ్‌సైట్.. కంపేర్ ది మార్కెట్ సమాధానం కనుక్కోవాలి అనుకుంది. ప్రపంచంలోని ప్రజలకు మరో దేశంలో నివసించే అవకాశం వస్తే... ఎవరు ఏ దేశాన్ని ఎంచుకుంటారు అని ప్రశ్నించి... సమాధానాలు రాబట్టింది. ఆ జాబితాని రిలీజ్ చేసింది. ప్రపంచంలో 50 దేశాలను ప్రజలు ఎక్కువగా ఎంచుకున్నారు. వాటిలో కెనడా మొదటిస్థానంలో నిలిచింది. లిస్టులోని టాప్ 10 దేశాలేవో తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎక్కువమంది నివసించాలనుకునే దేశంగా కెనడా నిలిచింది. ఆఫ్రికా, ఆసియా దేశాలు, కరీబియన్ దీవులు, దక్షిణ అమెరికా దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. కెనడా తరచూ ఇలాంటి లిస్టుల్లో టాప్‌లో ఉంటోంది. కారణం అక్కడి ప్రభుత్వాల పారదర్శక పాలన, పౌరుల స్వేచ్ఛ, నాణ్యమైన జీవన ప్రమాణాలు, ఆర్థిక స్వేచ్ఛ, నాణ్యమైన విద్య.
శుచి శుభ్రతకు పెట్టింది పేరైన జపాన్... రెండో స్థానంలో నిలిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. 31 దేశాల ప్రజలు జపాన్‌ని బాగా ఇష్టపడుతున్నారు. వారిలో ఆస్ట్రేలియా వారు కూడా ఉండటం విశేషం. జపాన్‌లో ప్రజలు వందేళ్లకు పైన జీవిస్తున్నారు. అందువల్లే చాలా మంది జపాన్‌లో నివసించాలి అనుకుంటున్నారు. అందమైన స్పెయిన్‌కి మూడో స్థానం ఇచ్చారు ప్రపంచ దేశాల ప్రజలు. 19 దేశాల వారు తమ ఫేవరిట్ దేశంగా దీన్ని ఎంచుకున్నారు. స్పెయిన్‌లో ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు చాలా బాగున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ చైనా ఈ లిస్టులో 4వ స్థానం పొందడం విశేషం. 15 దేశాల వారు చైనాలో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. ఈమధ్య చైనా, అమెరికాతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతుండటమే ఇందుకు కారణం అనుకోవచ్చు. యూరప్‌కి పశ్చిమాన ఉండే ఫ్రాన్స్ అందమైన దేశం అనడంలో డౌట్ అక్కర్లేదు. అక్కడి భవనాల నిర్మాణ శైలి ఇట్టే ఆకట్టుకుంటుంది. అక్కడి ఆహారం, వైన్, ఫ్యాషన్ అన్నీ అదుర్సే. అందువల్లే ఈ లిస్టులో ఫ్రాన్స్ ఐదో స్థానంలో నిలిచింది. 11 దేశాల ప్రజలు ఫ్రాన్స్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ప్రత్యేకమైన సంప్రదాయాలు, పర్యాటకులతో కళకళలాడే టర్కీ కూడా ఈ లిస్టులో ఆరో స్థానంలో నిలిచింది. ఈ దేశం టూరిజం పరంగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక్కడి వంటలు, ఫ్లేవర్స్, కల్చర్స్, మతాలు, చరిత్ర అన్నీ పర్యాటకులకు నచ్చుతున్నాయి. అటు యూరప్, ఇటు ఆసియా సంప్రదాయాలు ఇక్కడ మిక్స్ అవుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో సంపన్న దేశమైన దక్షిణాఫ్రికా కూడా టర్కీతోపాటూ ఆరో స్థానంలో నిలిచింది. ఐతే.. దీన్ని ఏడో దేశంగా చెబుతున్నారు. అధునాతన ఆఫ్రికా కల్చర్‌కి అద్దం పడుతున్న సౌతాఫ్రికా టూరిజం పరంగా కూడా బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివసించాలనుకుంటున్నారు.
ఈ లిస్టులో భారత్ 8వ స్థానంలో నిలవడం గొప్ప విషయం. నిజానికి ఇందులో ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే మన దేశంలో ఉండేంత వైవిధ్యం ఎక్కడా కనిపించదు. ఏడు దేశాల ప్రజలు తమ దేశాల్ని వదిలేసి... భారత్‌లో నివసించాలి అనుకుంటున్నారు. బంగ్లాదేశ్, భూటాన్, ఫిన్లాండ్, ఐవరీ కోస్ట్, లిబియా, నైగర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ) ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. మరో సంపన్న దేశమైన ఆస్ట్రేలియా ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. 6 దేశాల ప్రజలు ఆస్ట్రేలియాలో నివసించాలి అనుకుంటున్నారు. విశాలమైన ఆస్ట్రేలియాలో బీచ్‌లు, ఎడారులు చాలా ఉన్నాయి. ఇక్కడ హెల్త్ కేర్, జీవన ప్రమాణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ లిస్టులో గ్రీస్, ఫిజి కలిసి... పదోస్థానంలో నిలిచాయి. ఆర్మేనియా, సైప్రస్, నార్త్ మాసిడోనియా, సెర్బియా దేశాల వారు గ్రీస్‌ని ఎంచుకున్నారు. కిరీబాటీ, మార్షల్ ఐలాండ్స్, నౌరు, తువలు దేశాల వారు ఫిజిని ఎంచుకున్నారు.