జీవితం అంటే సర్థుబాటు ధోరణీతో జీవించడం కాదు మనకు నచ్చినట్లుగా జీవించడమే అసలు ఉద్దేశం అంటున్నారు కారొల్ వార్డెర్‌మాన్. ఆమె వయసు 61 ఏళ్లు. చూడటానికి అలా ఉండదు. టీవీ ప్రజెంటర్ కాబట్టి..ఆమె తన లుక్‌పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మధ్య వయస్సు మహిళలా కనిపిస్తుంది. అందుకే ఆమెను కౌంట్‌డౌన్ క్వీన్ అని పిలిచేవారు. కొన్నేళ్లుగా ఆమె తన బ్యూటీ సీక్రెట్‌తో ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. ఈమధ్యే బ్రిటన్‌లో ట్రావెల్ చేసి.. ఆ వివరాల్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ ట్రావెల్ ఆమెకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే ఆమెకు తన ఇంట్లో ఉండటం కంటే... ట్రావెల్ చెయ్యడమే ఇష్టం. అందులో భాగంగానే ఆమె ఇంటిని పూర్తిగా వదిలేసి క్యాంపర్‌వ్యాన్‌లో నివసించాలని నిర్ణయించుకుంది.
కరోనా వచ్చాక చాలా మంది భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. "రేపు అన్నది ఎలా ఉంటుందో తెలియదు... ఇప్పుడే నచ్చినట్లు జీవించాలి" అనే కాన్సెప్ట్‌తో ఇళ్లను వదిలేసి వ్యాన్లలో జీవిస్తున్నారు. కారొల్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. డబ్బు ఖర్చైనా పర్వాలేదు... వ్యాన్ మాత్రం లగ్జరీ హోమ్ లాగా ఉండాలి అనుకుంది కారొల్. అందుకే ఆ వ్యాన్ కోసం రూ.38 లక్షలు ఖర్చు పెట్టింది. @vanlifebuilds సంస్థ తయారుచేసిన క్యాంపర్ వ్యాన్‌ను కొనుక్కుంది.
కారొల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.27 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. వాళ్లలో చాలా మంది తాము కూడా ఆమెతో ట్రావెల్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కారొల్‌కి ఇంగ్లండ్‌లోని బ్రిస్టోల్‌లో దాదాపు రూ.25 కోట్ల విలువైన లగ్జరీ హోమ్ ఉంది. అందువల్ల ఆమెకు ఖరీదైన వ్యాన్ కొనడం కష్టమేమీ కాదు. అందుకే కొనేసింది. తన ఇంటిని అమ్మేసినా.. ప్రస్తుతం అందులోనే ఉంది. ఆమెకు వేల్స్‌లో మరో ఇల్లు ఉంది. ఈ క్యాంపర్‌వ్యాన్‌ని ఆమె ఫిబ్రవరిలో కొంది. దీని పేరుతో వార్డర్‌వ్యాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా ప్రారంభించింది. ఆ పేజీని 7,573 మంది ఫాలో అవుతున్నారు.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వ్యాన్ ఫొటోని షేర్ చేసిన కారొల్... "వ్యాన్ అలర్ట్... నా బేబీ వార్డర్ వ్యాన్.. వోక్స్‌ట్రెక్ నుంచి కొత్త చక్రాలతో వచ్చేసింది" అని తెలిపింది. త్వరలో తాను ఈ వ్యాన్‌లో వేనేకి వెళ్లబోతున్నట్లు తెలిపింది. ఈ వ్యాన్‌లో 2 ఫ్లోర్లు ఉన్నాయి. లోపల అంతటా నియోన్ లైట్స్ ఉన్నాయి. పైన ఓపెన్ టాప్ రూఫ్ ఉంది. త్వరలోనే ఈ వ్యాన్‌లోకి పూర్తిగా షిఫ్ట్ అయ్యి.. తన డ్రీమ్ జర్నీ స్టార్ట్ చేస్తానంటోంది కారొల్.