అమర్నాథ్ యాత్రికులకు వరద ప్రళయంగా పరిణిమించింది. అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు పొటేత్తుతోంది. దీంతో భక్తులు కొట్టుకుపోతున్న ఘటనలు గత రెండు రోజులుగా సాగుతోంది. ఈ క్రమంలోనే అమర్‌నాథ్‌లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభవృష్టి అనంతరం ఒక్కసారిగా వరద పోటెత్తింది. మంచు లింగం ఉన్న గుహ వద్ద జలప్రళయం విరుచుకుపడింది. ఈ ప్రవాహంలో చిక్కుకొని కొంత మంది భక్తులు కొట్టుకుపోయారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. సైన్యం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లలో గాలిస్తోంది. అమర్‌నాథ్ గుహ సమీపంలో చిక్కుకున్న భక్తులను హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అమర్‌నాథ్ గుహ సమీపంలోని కొన్ని టెంట్లు, గుడారాలపై వరద విరుచుకుపడింది. ఆ వరదలో కొంత మంది భక్తులు కొట్టుకుపోయారు. శుక్రవారం (జులై 8) సాయంత్ర 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్ఫీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విమానంలో తరలిస్తున్నారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
కొవిడ్ సంక్షోభం కారణంగా రెండేళ్లు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రకు ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల కింద యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వర్షం కొంత తెరిపి ఇవ్వడంతో యాత్రి తిరిగి ప్రారంభమైంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఊహించనివిధంగా కుంభవృష్టి కురిసింది.