శ్రీలంకలో ఎవర్ని కదలించిన కన్నీటి పర్యంతమయ్యే కథలే వినాల్సి వస్తోంది. ఎవర్ని పలకరించినా ఆదుకొంటారేమోనన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న దుస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం అయ్యేసరికి ప్రజలు పూర్తిగా అలిసిపోతున్నారు. పొద్దున్న లేచి నిత్యావసరాలకు ఒక యుద్ధం, ఆఫీసులకు వెళ్లడానికి మరో పోరాటం, సరుకుల కోసం క్యూలలో రోజుల తరబడి నిల్చోవాల్సి రావడం. దాంతో, పూర్తిగా నిస్సత్తువ ఆవహిస్తోంది. పోనీ, రాత్రి కంటి నిండా నిద్రపోదామంటే కరంట్ కోతలు, ఉక్కపోత. చాలీచాలని తిండి. కుటుంబానికి సరిపడా ఆహారం వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో పెద్దవాళ్లకు మందులు లేవు. పిల్లలకు సరైన చదువుల్లేవు. ప్రస్తుతం స్కూళ్లు మూతబడ్డాయి. పిల్లలను స్కూలు తీసుకెళ్లాడానికి రవాణా సదుపాయాలు లేవు. ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతున్నాయి. కరోనాతో మొదలై మూడేళ్లుగా ఆన్‌లైన్ పాఠాలే గతి.
శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఫోన్ చేసి డబ్బులు సర్దమని అడుగుతారు. పోలీసులు, మిలటరీ ఉన్న కాస్త ఆశలనూ తుడిచిపెట్టేస్తున్నారు. కానీ, ఇంకా ఊపిరి పీల్చుకోగలుగుతున్నందుకు సంతోషిస్తున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ల పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. గత వారం ఓ తల్లి తన పిల్లలిద్దరితో పాటు నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది. రోజూ మనసు ముక్కలైపోయే వార్త వినిపిస్తూనే ఉంది. బతుకు దిన దిన గండంగా మారింది. అని శ్రీలంకలో నివసిస్తున్న పలు అవార్డులు గెలుచుకున్న రచయిత, పాత్రికేయుడు ఆండ్రూ ఫిడెల్ ఫెర్నాండో పేర్కొన్నారు.