శ్రీలంక దేశంలో మానవ జీవితం ఎంతదుర్భరంగా మారిందో చెప్పే ఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. స్థానికంగా ఉపాధి కరువవ్వడంతో విదేశాలకు వెళ్లడమే అక్కడి ప్రజలకు ఏకైక మార్గంగా పాలకుల విధానంగా మారింది. మరోవైపు శ్రీలంక దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ దేశధ్యక్షుడు సహా ఆయన పటాలమంతా గద్దె దిగాలని పిలుపునిచ్చినా వారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. తెరవెనుక జరుగుతున్న ఒప్పందాలు చూస్తుంటే దేశప్రజల పట్ల వారి చిన్నచూపు స్పష్టగా కనిపిస్తోంది. వారి చర్యలు దేశ రాజకీయాలను మరింత విషపూరితం చేస్తున్నాయని అనేకమంది భావిస్తున్నారు. దేశాన్ని అథోగతికి ఈడ్చిన నాయకులే మళ్లీ ఉద్ధరిస్తామని పట్టుబడుతున్నారు. కానీ, వారి విధానాల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీలంక పౌరులను మిడిల్ ఈస్ట్ దేశాలకు పనిమనుషులుగా, డ్రైవర్లు, మెకానిక్కులుగా పంపాలనే విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. వీళ్లు అక్కడ పనిచేసి సంపాదించిన డబ్బులను స్వదేశానికి పంపిస్తారని ఆశ. ఇది పౌరుల జీవితాలను మరింత దుర్భరం చేస్తుంది. స్థానికంగా పని దొరకక విదేశాలకు వలస వెళ్లేవారు మరింత గందరగోళంలో పడతారు. కుటుంబాలను విడిచిపెట్టి, సరైన రక్షణ, బాగోగులు చూసుకునే ఏజెన్సీ లేకుండా విదేశాలకు వెళ్లడం, వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఒక ఆంత్రపాలజిస్ట్ శ్రీలంక తీసుకొచ్చిన ఈ విధానాన్ని "పిశాచ అవస్థ"గా (ది వాంపైర్ స్టేట్) గా పేర్కొన్నారు.