వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలనూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం వైయస్ జగన్ ప్లీనరీలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న మంచి వల్ల కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించి.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేలా గెలిపించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 175 స్థానాలూ గెలవడం అసాధ్యం కాదని.. సుసాధ్యమేనంటూ శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సైన్యంగా ఏర్పడాలని సూచించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబుతో కూడిన కౌరవ సైన్యంపై గెలిచేందుకు అర్జునుడి పాత్ర పోషించాల్సింది మీరేనని శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు.