ఒకరిపై అభిమానమున్నా వారి విధానాలే కొన్ని సార్లు అభిమానులను దూరం చేస్తుంది. అలాంటి ఘటనే నెల్లూరుజిల్లాలో చోటు చేసుకొంది. ఆ యువకుడికి వైఎస్ జగన్ అంటే అభిమానం.. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు. కానీ ఇంతలో టీడీపీలో చేరిపోయాడు. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలోని చుండికి చెందిన ముతకని రమేష్‌కు జగన్‌పై అభిమానం. అందుకే ఆయన పేరును వైసీపీ ఆవిర్భావ సమయంలో చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు చుండిలో జరిగిన బాదుడే, బాదుడే కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సొంత ఊరికి వచ్చిన టీడీపీ ఇంఛార్జ్ నాగేశ్వరరావు సమక్షంలో రమేష్ తన బంధువులు, స్నేహితులతో కలిసి పసుపు కండువా కప్పుకున్నాడు. కొన్ని అనివార్య కారణాలతో పార్టీ మారాల్సి వచ్చిందని రమేష్ అంటున్నాడు. జగన్ అభిమానిగా ఉన్న యువకుడు టీడీపీలో చేరడం చర్చనీయాంశమైంది. అతడి ఫోటో కూడా వైరల్ అవుతోంది.
కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. పెరిగిన ధరలతో జనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక కుటుంబాలు టీడీపీలో చేరడం ఆనందంగా ఉందని.. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము అన్నారు.