మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నేడు రాష్ట్రానికి రానున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైసీపీ ఎంపీలు, ఎమ్మెలేలు మంగళవారం సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఇప్పటికే ప్రధాని మోదీ సమక్షంలో ఆమె నామినేషన్ దాఖలుచేసే కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు వెళ్లారు. ముర్ము వైసీపీకి ధన్యవాదాలు తెలపనున్నారు.
ఇదిలావుంటే టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై చర్చించి.. చివరికి టీడీపీ బలపరిచింది. సామాజిక న్యాయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. గతంలో కూడా కె.ఆర్. నారాయణన్, ఏ.పి.జె. అబ్దుల్ కలాంలను టీడీపీ బలపరిచిందని గుర్తు చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్‌గా బాలయోగిని, శాసనసభ స్పీకర్‌గా ప్రతిభా భారతిలను టీడీపీ చేసిందన్నారు.
కేంద్ర మంత్రిగా కింజారపు ఎర్రంనాయుడుని చేయడం ద్వారా తెలుగుదేశం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా తెలుగు బిడ్డ పి.వి. నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిందన్నారు. ఈ విధంగా తెలుగు వారి కోసం, సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందు వరుసలో నిలబడిందన్నారు. ఇప్పటికే ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు లభించగా.. తాజాగా అదే బాటలో టీడీపీ కూడా నడిచింది.