దేనికైనా సంకల్ప బలముండాలి. అదే చేసిచూపుతున్నాడు ఓ కుర్రాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పైలట్, 17 ఏళ్ల మ్యాక్ రూథర్ ఫోర్డ్ అహ్మదాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. 15 ఏళ్లకే లైసెన్స్ పొందిన యువ పైలట్లలో అతడు కూడా ఒకడు. బ్రస్సెల్ కు చెందిన రూథర్ ఫోర్డ్ ఒక పెద్ద లక్ష్యంతో ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రపంచాన్ని చిన్న వయసులోనే ఒంటరిగా, విమానంలో చుట్టేసిన వ్యక్తిగా రికార్డు నమోదు చేయాలన్నది అతడి సంకల్పం.
ఈ ఏడాది మార్చిలో చిన్న విమానంలో అతడు ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఒక్క ఇంజన్ ఉన్న చిన్న పాటి విమానంలో అతడు గత ఆదివారం అహ్మదాబాద్ లో దిగాడు. ‘’భిన్నంగా చేసి చూపించడానికి పెద్ద వారే అయి ఉండక్కర్లేదు. సంకల్పం, అభిరుచి ఉంటే చాలు’ అన్నదే యువతకు తానిచ్చే సందేశమని రూథర్ ఫోర్డ్ పేర్కొన్నాడు.
తన మార్గంలో యువతను కలవడమే తన ధ్యేయమని చెప్పాడు. వారే అద్భుతాలు చేయగలరని, తమ సమాజాన్ని మార్చగలరని అన్నాడు. బల్గేరియా, ఇటలీ, గ్రీస్, ఈజిప్ట్, సూడాన్, కెన్యా, టాంజానియా, యెమెన్, మారిషస్, సీచెల్లెస్, యూఏఈ, ఒమన్, పాకిస్థాన్ పర్యటన తర్వాత అతడు భారత్ కు చేరుకున్నాడు. మరో రెండు నెలల్లో అతడి యాత్ర పూర్తవుతుంది.
‘‘మా ఇంట్లో అందరూ విమాన చోదకులే. మా తల్లిదండ్రులు, తోడ బుట్టిన వారు, తాత, నాయినమ్మ అందరూ విమానం నడపడం తెలిసినవారే. దాంతో 11 ఏళ్ల నుంచే విమాన చోదకం నేర్చుకున్నాను. 15 ఏళ్లకు లైసెన్స్ పొందాను’’ అని వివరించాడు.