దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతావన్నీ కుటుంబ పార్టీలే అని విమర్శించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. రాజస్థాన్‌లోని శిరోహి జిల్లాలో జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు.రాబోయే ఎన్నికల్లో రాజస్తాన్‌లో బీజేపీ విజయం సాధించి, అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ''దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ. మిగతా పార్టీలు కుటుంబాలు, వంశ పాలనకే పరిమితమయ్యాయి. బీజేపీ దేశం కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుంది. మనకు పార్టీ ఏం ఇచ్చింది అని కాకుండా, మనం దేశానికి, పార్టీకి ఏమిచ్చామో ఆలోచించాలి.మనకు దేశమే ముఖ్యం. దేశం కోసం, పార్టీ కోసం పనిచేయాలి. ఏ బాధ్యత అప్పగించినా, సకాలంలో పూర్తి చేయాలి. పార్టీకి కార్యకర్తలే బలం. వాళ్లే శక్తి. ప్రజలకు దగ్గరగా ఉండండి. వాళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించండి. శిక్షణా శిబిరాల ద్వారా కార్యకర్తలు, నేతలు మరింత శక్తివంతమవుతారు. ఇది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుంది'' అని నద్దా వ్యాఖ్యానించారు.