ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పదేపదే చెప్పుకొనే పవన్ కళ్యాణ్ కాపు సంక్షేమానికి నిధులు కేటాయించకుండా దగా చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు నిలదీశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించినప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్ స్క్రిప్ట్‌నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారని ఆయన విమర్శించారు. వీకెండ్‌లో ఒకసారి వచ్చి జనవాణి అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ కనీసం తాను కాపునని ధైర్యంగా చెప్పుకోలేరని.. ఇప్పుడు కాపులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు.
పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే పార్ట్ టైమ్ పొలిటికల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్‌దే.. కానీ నడిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ అంటూ ఎద్దేవా చేశారు. పక్కనే ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వెయ్యని పవన్‌కి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పవన్ వారానికోసారి బయటకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారని.. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకువస్తే కాపులకు నిజంగా మేలు చేసిందెవరో రుజువులతో సహా వివరిస్తానన్నారు.
కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నిజమైన హీరో అన్నారు శేషు. జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అందుకే ప్రభుత్వ పథకాలపై టీడీపీ, జనసేన అబద్ధ ప్రచారం చేస్తున్నాయని.. వెనకబడిన అగ్ర కులాల విద్యార్థుల కోసం జగన్ విదేశీ విద్యా దీవెన పథకం ఒక వరం అన్నారు. చంద్రబాబు హయాంలో విదేశీ విద్య అమల్లో జరిగిన అక్రమాలను, లోపాలను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించిందన్నారు. కాపులకు ఏం కావాలో అవన్నీ సీఎం జగన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వం రూ.6 లక్షల వార్షిక ఆదాయ నిబంధన పెడితే దాన్ని సీఎం జగన్ రూ.8 లక్షలకు పెంచారని గుర్తు చేశారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయోజనం పొందుతారని తెలిపారు. గతంలో డబ్బున్న పిల్లలు కూడా కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్లారని.. కొంత మంది విద్యార్థులు విదేశాలు వెళ్లకుండానే డబ్బు కాజేశారని ఆరోపించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.