ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీలోకి మరిన్ని చికిత్సలు...వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 09:06 PM

ఆరోగ్య శ్రీ పథకం విషయంలో వైసీపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొంది. ఈ పథకం కింద మరింత విస్త్రుతంగా సేవలు అందించనున్నది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల సంఖ్యను మరింత పెంచాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామని అధికారులు, సీఎం జగన్‌కు వివరించారు. వైద్యారోగ్య శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన జగన్, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేయాలని ఆదేశించారు. ఈ రివ్యూ సందర్భంగా ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


విలేజ్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి బ్యాంకు ఖాతాలోకి, అక్కడినుంచి ఆస్పత్రికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా అంగీకార పత్రం, చికిత్స పూర్తైన తర్వాత ధ్రువీకరణ పత్రం, ఆ ధ్రువీకరణ పత్రంలో వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.


రోగులు కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని సీఎం జగన్ సూచించారు. అటు, రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అనే విషయాలను కూడా స్పష్టంగా తెలుసుకునేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు. ఎవరైనా లంచం అడిగినా, ఎక్కువ ఫీజు వసూలు చేసినా, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత, ఆరోగ్య సిబ్బంది ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీయాలని ఆదేశించారు.


ఆస్పత్రుల్లో చేరిన రోగులకు మరింత సాయం అవసరం అయితే, సమన్వయం చేసుకుని ఆ సాయం అందేలా చూడాలని జగన్ సూచించారు. రోగులకు అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని అధికారులకు సూచించారు. 108, 104 లాంటి సర్వీసుల్లోనూ లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆ వాహనాలపై కూడా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.


రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈనెల చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని ఆదేశించారు. పీహెచ్ సీ మొదలు, బోధనాసుపత్రి వరకూ సరిపడా వైద్యులు, సిబ్బంది ఉండాలన్నారు. నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేంతోనే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులకు వివరించారు. పేదలకు వైద్యం అందించే విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం వహించినా, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com