ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనివ్వబోనని ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పష్టంచేశారు. శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఆయన కార్యాలయం పైకి ఎక్కి శ్రీలంక జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆయన ఎమర్జెన్సీని విధించారు. అంతేకాదు, శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏది అవసరమైతే అది చేయాలని, అవసరమైతే కనిపించిన వారిని కాల్చిపడేయాలని వారికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విక్రమసింఘే మాట్లాడుతూ ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనివ్వబోనని అన్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తాను తప్పుకునే ప్రయత్నం చేయాలని ఆందోళనకారులు చూస్తున్నారని చెప్పారు.