ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకుల కలకలంరేగింది. భారతీయ దంపతులను సోదా చేసిన కస్టమ్స్ అధికారులు నివ్వెరపోయారు. వారి వద్ద ఏకంగా 45 పిస్టళ్లు లభ్యమయ్యాయి. ఆ దంపతులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారిని జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్ లుగా గుర్తించారు. అయితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్నవి అవి నిజం తుపాకులా? కాదా? అనే అంశం కూడా పరిశీలించారు. ఈ కేసును విచారిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) మాత్రం ఇవి నిజం తుపాకులేనని అభిప్రాయపడింది. ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్నాయని ఎన్ఎస్ జీ గుర్తించిందని ఓ కస్టమ్స్ అధికారి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న తుపాకుల విలువ రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఇదిలావుంటే జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్ దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. జగ్జీత్ సింగ్ వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీత్ సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ విచారణలో తెలిపాడు. ఆ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్ లోని పారిస్ నుంచి వియత్నాం తెచ్చాడని, అక్కడ తన సోదరుడు జగ్జీత్ కు అప్పగించాడని వెల్లడైంది. అనంతరం హోచిమిన్ సిటీ ఎయిర్ పోర్టు నుంచి మాయం అయ్యాడని కస్టమ్ అధికారి వివరించారు.
మరోవైపు ఆ రెండు బ్యాగులకు ఉన్న సెక్యూరిటీ ట్యాగ్ లను తొలగించి, వాటిని రూపుమాపడం ద్వారా జస్వీందర్ కౌర్ భర్తకు సాయపడిందని తెలిపారు. అంతేకాదు, తామిద్దరం గతంలో టర్కీ నుంచి భారత్ కు 25 పిస్టళ్లు తెచ్చినట్టు ఆ దంపతులు ఒప్పుకున్నారని వెల్లడించారు.
.