వివిధ రాష్ట్రాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్థానికీకరణ చర్యలపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదికను బుధవారం విడుదల చేసింది. నవరత్నాల ద్వారా పేదల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నివేదికలో పేర్కొంది. నవరత్నాలతో మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గుమ్మం వద్దే పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తున్నదని నివేదిక స్పష్టం చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై క్షేత్రస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాపులు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో లక్ష్యాల సాధన పురోగతిపై రియల్‌టైమ్ పర్యవేక్షణకు ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు నివేదిక తెలిపింది.