చైనా విమాన కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవి ఎల్ఏసీకి చాలా దగ్గరగా వచ్చినప్పుడల్లా గమనించి తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు. సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ దగ్గరికి చైనా యుద్ధ విమానాలు వచ్చినప్పుడల్లా.. ధీటుగా సమాధానం ఇస్తున్నామని ఆయన తెలిపారు. చైనా విమానాలు తారసపడినప్పుడల్లా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, వాటిని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. భారత్-చైనా సైనికాధికారుల మధ్య 16వ విడత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేము తూర్పు లడఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ పొడవునా మా రాడార్‌లను మోహరించడం ప్రారంభించాం. క్రమంగా మేము ఈ రాడార్‌లన్నింటినీ మా సిస్టమ్‌తో అనుసంధానించాం. తద్వారా మేం గగనతల కార్యకలాపాలను పర్యవేక్షించగలుగుతాం." అని వీఆర్ చౌదరి చెప్పారు. చైనాకు సంబంధించిన విమానాలు ఘర్షణ ప్రదేశాలకు దగ్గరగా వస్తున్నట్టు గమనించిన వెంటనే వాటిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆ సమయంలో ఫైటర్ విమానాలను రంగంలోకి దించడంతో పాటు అన్ని వ్యవస్థలను హై అలర్ట్‌లో ఉంచుతామని, ఇలా చైనా విమానాలను అడ్డుకుంటామని చెప్పారు.
అదేవిధంగా చైనా విమాన కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవి ఎల్ఏసీకి చాలా దగ్గరగా వచ్చినప్పుడల్లా గమనించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను సకాలంలో మోహరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రారంభించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకానికి చాలా మంచి స్పందన లభిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఔత్సాహికుల నుంచి తమకు 7.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కాగా తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు భారత్, చైనా మధ్య 16వ విడత ఉన్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం మొదలయ్యాయి.