మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే వర్గం నుండి మరింత మంది నేతలు దూరం కాబోతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా వేయగా..ఇప్పుడు ఆ జాబితాలోకి ఎంపిలు చేరారు. దీంతో తన తండ్రి స్థాపించిన శివసేన.. చేజారే అవకాశాలున్నాయి. డజనుకు పైగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ఎంపిలు అసమ్మతి నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో టచ్‌లు ఉన్నారని తెలుస్తోంది. వారంతా గత రాత్రి తాము ఏక్‌నాథ్ వర్గంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 12 మంది ఎంపిలు.. తమను ఏక్‌నాథ్ వర్గంలోని ఎంపిలుగా చూడాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు సమాచారం. దీంతో వీరందరికీ హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరి భద్రతను మంజూరు చేసింది. వీరిలో శ్రీరంగ్ భర్నే, భావనా గావ్లీ, రాజేంద్ర గవిత్, హేమంత్ గాడ్సే, ప్రతాప్ జాదవ్, సదాశివ్ లోఖండే, సంజరు మాండ్లిక్, ధైర్యషీల్ మానే, హేమంత్ పాటిల్, రాహుల్ షెవాలే, శ్రీకాంత్ షిండే, కృపాల్ తుమానే ఉన్నారు. అంతకముందు వీరంతా ఏక్‌నాథ్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశానికి హాజరయ్యారని తెలుస్తోంది.
ఇప్పుడు వీరికి వై సెక్యూరిటీని కేంద్రం కల్పించింది. దీంతో వీరి నివాసాలు, కార్యాలయాల వద్ద పారా మిలటరీ సిబ్బందిని మోహరిస్తారు. శివసేన నూతన పార్లమెంటరీ నేతగా రాహుల్ షెవాలేతో పాటు పార్టీ చీఫ్ విప్‌గా భావనా గవవాలే నియమించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం లేఖ సమర్పించే అవకాశం ఉంది. ఈ 12 మంది ఎంపిల తిరుగుబాటుతో ప్రస్తుతం ఉద్ధవ్ వర్గంలో కేవలం ఆరుగురు ఎంపిలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర క్యాబినేట్‌పై బిజెపి అధినేతలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ ఢిల్లీకి వెళ్లారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినందుకు ఉద్ధవ్ పలువురు కీలక నేతలను పార్టీ నుండి బహిష్కరించిన సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.