ప్రజలకు ఊరాట కలిగించే దిశగా పతంజలి కంపెనీ నిర్ణయం తీసుకొంది. తమ బ్రాండ్ కింద విక్రయించే వివిధ వంట నూనెల ధరలను లీటర్ కు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గించనున్నట్టు పతంజలి ఫుడ్స్ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నూనెల ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా పరిస్థితులకు అనుగుణంగా దేశంలో వంట నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని కంపెనీలను ఆదేశించిన విషయం తెలిసిందే.
కేంద్రం సూచనల మేరకు.. మదర్ డెయిరీ లీటర్ కు రూ.14 వరకు, ఆదానీ విల్మర్ (ఫ్రీడమ్ ఆయిల్) కంపెనీ రూ.30 వరకు తగ్గించాయి. తాజాగా పతంజలి ఫుడ్స్ (ఇటీవలి వరకు రుచి సోయా) కంపెనీ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరికొన్ని కంపెనీలు కూడా తమ బ్రాండ్ల వంట నూనెల ఎమ్మార్పీని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
‘‘పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్ ల ధరలను రూ.10 – రూ.15 వరకు తగ్గించనున్నాం. గత 45 రోజుల్లో తగ్గించినవి, తాజా తగ్గింపు కలిపి లీటర్ నూనెపై రూ.30–35 వరకు ధర తగ్గించినట్టు అవుతోంది. చాలా కొన్ని కంపెనీలు మాత్రమే వంట నూనెల ధరలు తగ్గిస్తున్నాయి..” అని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా తెలిపారు.