పోలీసులు అంటనే జాలిలేని వారిగా చెబుతుంటారు. వారికి ఓ మనస్సు ఉంటుందని, ఇతరుల మాధిరిగా వారు సున్నిత అంశాలపై చాలా సున్నితంగా స్పందిస్తారని ముంబై పోలీసులు తమ లేఖ ద్వారా స్పష్టంచేశారు. పరీక్షా ఫలితాల సమయం దగ్గర పడుతుంటే విద్యార్థుల్లో తెలియని ఆందోళన, భయం పెరుగుతుంటాయి. ముంబైకి చెందిన ధ్రువ్ అనే విద్యార్థి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఐసీఎస్ఈ బోర్డ్ పదో తరగతి ఫలితాలను ప్రకటించే రోజు రావడంతో అతడిలో భయం పెరిగిపోయింది. ఇక దీన్ని నియంత్రించుకోలేక.. అతడు తన బాధను ముంబై పోలీసులతో పంచుకున్నాడు. దీనికి పోలీసులు ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెటిజన్ల హృదయాలను తాకుతోంది.
డీజీపీ మహారాష్ట్ర, ముంబై పోలీస్ లను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ధ్రువ్ పోస్ట్ పెట్టాడు. ‘‘ఈ రోజు నా ఐసీఎస్ఈ ఫలితాలు రానున్నాయి. దీంతో నాకు భయంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు. దీనికి ముంబై పోలీసు ట్విట్టర్ హ్యాండిల్ బదులిచ్చింది. ‘‘హే ధ్రువ్, నీ ఫలితాల గురించి ఆందోళన చెందకు. పరీక్ష అన్నది ఓ ప్రయాణమే. అదే చివరి గమ్యస్థానం లేదా సాధన కాదు. ఇతర పరీక్షల మాదిరే ఇది కూడా. నీ సామర్థ్యాలపై నీకు నమ్మకం ఉండాలి. ఐసీఎస్ఈ ఫలితాల్లో నీకు అంతా మంచే జరగాలి’’ అని ముంబై పోలీసులు సూచించారు.