మారుతున్న జీవన శైలీలో ఆరోగ్యం ఎపుడు పాడవుతుందోనని తెలియని ఈ పరిస్థితుల్లో నేడు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతో కీలకంగా మారింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు గణనీయంగా పెరుగుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం చాలా మందికి తెలిసొచ్చింది. దీంతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. హెల్త్ ప్లాన్ ను ఏడాదికే కాదు, రెండు, మూడేళ్లకు కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తున్నారు కనుక బీమా సంస్థలు ప్రీమియంలో కొంత రాయితీ ఇస్తాయి.
ఏడాదికి పాలసీ తీసుకున్నా, రెన్యువల్ సమయంలో రెండు, మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. దీంతో మర్చిపోయామనే ప్రస్తావన రాదు. మూడేళ్లకోసారి చేసుకుంటే చాలు. దీనివల్ల కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు కూడా ఉన్నాయి.
మల్టీ ఇయర్ (ఏడాదికి మించిన) పాలసీ తీసుకుంటే తిరిగి రెన్యువల్ చేసుకునే వరకు ప్రీమియంలో మార్పు ఉండదు. బీమా సంస్థలు ఎప్పటికప్పుడు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీనివల్ల రెన్యువల్ సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా రెండేళ్ల పాటు రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది. తిరిగి రెన్యువల్ సమయంలోనే పెరిగిన రేట్ల ప్రకారం ప్రీమియం చెల్లించాలి.
ఇటీవల కరోనా క్లెయిమ్ లను పరిగణనలోకి తీసుకున్న బీమా సంస్థలు ప్రీమియంను పెంచేశాయని, మల్టీ ఇయర్ పాలసీ తీసుకున్న వారు ఈ రూపంలో లాభపడ్డారని పాలసీ ఎక్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు నావల్ గోయల్ తెలిపారు. మూడేళ్లకు పాలసీ తీసుకోవడం వల్ల ఇలా ప్రీమియం పెరుగుదల రూపంలో రక్షణకు తోడు, చెల్లించాల్సిన ప్రీమియంలో రాయితీ కూడా కలిసొచ్చినట్టు అవుతుంది.
మూడేళ్లకు ఒకసారి చెల్లించినా మూడు భాగాలుగా చేసి ఆయా ఆర్థిక సంతవ్సరాల్లో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా సంస్థలు ఏజ్ గ్రూపులు నిర్వహిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారికి ఒక రకంగా 30-45, 46-55, 55-60, 60కు పైన ఇలా వయసు గ్రూపు ఆధారంగా ప్రీమియంను సవరిస్తుంటాయి. దీంతో ఈ గ్రూపు మారే ముందు మల్టీ ఇయర్ పాలసీ తీసుకోవడం ప్రయోజనం.
ఇందులో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించి ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. ఏడాది తర్వాత సంస్థ సేవలు నచ్చలేదనో, క్లెయిమ్ విషయంలో కొర్రీలు పెట్టిందనో వేరే సంస్థకు మారిపోదామని అనుకుంటే..? కట్టిన ప్రీమియం వెనక్కి రాదు. అదే సమయంలో పోర్టింగ్ పెట్టుకుంటే మళ్లీ తాజాగా ప్రీమియం కట్టాల్సిందే. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి రావచ్చు. ఒకవేళ బీమా సంస్థ ప్రీమియం రేట్లను తగ్గిస్తే ఈ ప్రయోజనం కోల్పోతారు.