శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్ టోర్నీని యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనున్న ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను శ్రీలంక క్రికెట్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం దృష్ట్యా టోర్నీని నిర్వహించలేమని శ్రీలంక బోర్డు బుధవారం ప్రకటించింది. గురువారం ముంబైలో జరిగిన బీసీసీఐ అపెక్స్ సమావేశానికి హాజరైన గంగూలీ.. యూఏఈలో టోర్నీ జరుగుతుందని, ఈ సమయంలో వర్షం కురవదని చెప్పాడు. ఈసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. దేశంలో కొనసాగుతున్న రాజకీయ అశాంతి కారణంగా శ్రీలంక క్రికెట్ (SLC) లంక ప్రీమియర్ లీగ్ (LPL) మూడో సీజన్‌ను కూడా వాయిదా వేసింది.