అచ్చం సినిమాలోలా ఓ రోడ్డుపై మాటేసిన నకిలీ పోలీసులు ఓ బంగారు వ్యాపారి నుంచి రసీదులు లేవన్న కారణంగా వెండి తీసుకొని ఆ తరువాత ఉడాయించారు. పోలీసులమని చెప్పి బంగారం వ్యాపారుల్ని బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. అమాయకంగా వారు చెప్పిన మాట నమ్మి నిండా మునిగారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరానికి చెందిన తండ్రీ, కొడుకులు రామలింగేశ్వరరావు, యశ్వంత్‌లు వెండి వస్తువులను తయారు చేసే వ్యాపారులు. ఈనెల 16న రాజమండ్రి వెళ్లి 16 కేజీల వెండిని కొనుగోలు చేసుకుని బైక్‌పై సొంత ఊరికి వస్తున్నారు. ఉండి మండలం సాగపాడు వచ్చిన తర్వాత ఇద్దరి వ్యక్తులు వారి బైక్‌ను ఆపారు.
తాము తాడేపల్లిగూడెం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. తండ్రీకొడుకుల దగ్గర ఉన్న వెండికి, కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులు సరిగా లేవని భయపెట్టారు.. వారి నుంచి వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని పోలీస్ స్టేషనకు రమ్మని చెప్పి ముందు వారు వెళ్లారు.. వెనుక తండ్రీకొడుకులు ఫాలో అయ్యారు. మార్గ మధ్యంలో కనిపించకపోవడంతో తండ్రీ కొడుకులు అవాక్కయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి కోసం కొద్దిసేపు వేచి చూశారు. కానీ తర్వాత వారికి అనుమానం వచ్చింది
వెంటనే పోలీసులకు జరిగిన విషయం గురించి వివరించారు. వీరు చెప్పిన సమాచారం విని పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ నుంచి తమ వారు ఎవరు రాలేదని.. వాళ్లెవరో మోసం చేశారని చెప్పారు. దీంతో వారు ఉండి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమీపంలో సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో ఉన్నారు.