శ్రావణ మాసం పూజలకుతోడు, అధిక వర్షాలతో చికెన్ వినియోగం తగ్గినట్టు వర్తకులు చెబుతున్నారు. ఉత్తరాదిన శ్రావణ మాసం ఇప్పటికే మొదలైంది. అక్కడ శ్రావణంలో మాంసానికి దూరంగా ఉండడాన్ని కొందరు పాటిస్తుంటారు. పైగా చికెన్ ధరలు అధికంగా ఉండడం కూడా వినియోగం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫార్మ్ గేట్ చికెన్, కోడి గుడ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. చికెన్ ధర కొన్ని రాష్ట్రాల్లో 25 శాతం వరకు, మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం వరకు దిగొచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో ధరలు ఎక్కువగా తగ్గాయి. మహారాష్ట్రలో కిలో ధర రూ.115 నుంచి రూ.60కు క్షీణించగా, ఝార్ఖండ్ లో రూ.50కు దిగొచ్చింది.
ఫార్మ్ గేట్ చికెన్ ధర కిలోకు రూ.60కు పడిపోయిందని, ఇది తయారీ వ్యయం కంటే తక్కువ ధరగా పౌల్డ్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వీనర్ వసంతకుమార్ శెట్టి తెలిపారు. ఉత్తరాదిన జులై 15నే శ్రావణం మొదలైందని, దీంతో డిమాండ్ తగ్గిందని పౌల్ట్రీ ఇంటెగ్రేటర్లు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం కూడా ఉందంటున్నారు. మరోవైపు కోడి గుడ్ల ధరలు కూడా పలు ప్రాంతాల్లో 30-35 శాతం వరకు తగ్గాయి. తెలుగునాట శ్రావణ మాసం జులై 29న మొదలు కానుంది. ఇక్కడ కూడా ధరలు ఏ మేరకు తగ్గుతాయో చూడాల్సి ఉంది.