అతి త్వరలోనే దేశంలో 5జీ టెలికం సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో వినియోగదారులకు మరింత వేగవంతమైన బ్రౌజింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంత వేగం అంటే.. 4జీతో పోలిస్తే 5జీ వేగం 100 రెట్లు ఎక్కువ. ఇదిలావుంటే 5జీ స్పెక్ట్రమ్ వేలం కొనసాగుతోంది. వచ్చే రెండు రోజుల్లో వేలం ముగియనుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ ఎంటర్ ప్రైజెస్ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నాయి.
5జీ స్పెక్ట్రమ్ కోసం టెలికం సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. మరి ఈ ప్రభావం అవి ప్రారంభించబోయే 5జీ సేవల ధరలపై చూపించదా? అంటే.. చూపించొచ్చనే సమాధానం వస్తోంది. 4జీ, 5జీ ధరల మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చని, స్పెక్ట్రమ్ వేలం ముగిసిన తర్వాతే తుది వ్యయాలపై అంచనాకు రాగలమని ఎయిర్ టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖాన్ లోగడ చెప్పారు. 5జీ సేవలు ఇప్పటికే ప్రారంభమైన చోట ధరలు 4జీ కంటే ఎక్కువ లేవన్నారు.
కానీ పరిశ్రమ వర్గాలు, నిపుణుల అంచనా ప్రకారం అయితే ప్రస్తుతం మనం 4జీ కోసం చెల్లిస్తున్న దానికంటే.. 5జీ సేవల కోసం 10-12 శాతం వరకు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. టెలికం పరిశ్రమ దశాబ్దానికి పైగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నది. చాలా కంపెనీలు కనుమరుగై చివరికి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో మిగిలాయి. ఒక్కో యూజర్ నుంచి వీటికి సగటున రూ.200 ఆదాయం వస్తోంది. కానీ, పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఇది రూ.300కు వెళ్లాలని ఎయిర్ టెల్ లోగడే స్పష్టం చేసింది. కనుక 5జీ సేవలకు టారిఫ్ లను అవి కొంచెం అధికంగానే నిర్ణయించొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి 5జీ సేవలు మొదలవుతాయని అంచనా.