బ్రిటర్ దేశానికి ప్రధానిగా మన దేశానికి చెందిన వ్యక్తి అవుతారన్న ఆశలకు గండిపడే పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్ దేశ ప్రధాని అయ్యేందుకు జరుగుతున్న పోరులో తాను వెనుకబడినట్టు తాజాగా భారత సంతతికి చెందిన రుషి సునక్ అంగీకరించారు. అయితే ప్రతి ఓటును సొంతం చేసుకునేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. వ్యక్తిగత పన్నుల కోతపై ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ ఇచ్చిన హామీ ఆమెను ఆధిక్యతలో నిలిపింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేంత వరకు వ్యక్తి పన్నుల్లో కోత విధించే ప్రసక్తే లేదని రుషి సునుక్ నిజాయతీగా చెప్పారు. అయితే, లిజ్ ట్రుస్ తాను ప్రధాని అయిన వెంటనే వ్యక్తిగత పనుల్లో కోత విధిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై రుషి సునుక్ మాట్లాడుతూ, వ్యక్తిగత పన్నుల్లో కోత విధించబోనని తాను చెప్పడం ప్రజలకు నచ్చలేదని అన్నారు. తన మాటలు తన విజయావకాశాలను ప్రభావితం చేసినప్పటికీ... నిజాయతీగా చేయాల్సింది అదేనని చెప్పారు.