ఉపాధి కోసం బయటికి వెళ్లినవారు శాశ్వతంగా తిరిగిరాకపోతే ఆ కుటుంబం అనుభవించే క్షోభను ఊహించలేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు క్రేన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ ఘటన ఆవేదన కలిగించిందని వెల్లడించారు.
క్రేన్ సాయంతో కార్మికులు పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడి కార్మికులు పంప్ హౌస్ లోకి పడిపోవడం మానవ తప్పిదమా? లేక, యాంత్రిక లోపమా? అనేది ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతుల పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు రానీయకుండా అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నానని తెలిపారు.