సౌదీ అరేబియా అంటే దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ దేశంలో ఇటీవల అబ్బురపరిచే ఓ అద్భత నగరం వెలసింది. అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఓ అద్భుతమైన నగర నిర్మాణానికి పూనుకుంది. ఆ నగరం పేరు నియోమ్. నియోమ్లో నియో అంటూ కొత్త అని అర్థం. ఇక చివరన వచ్చే ఎం ముస్తాక్ బల్ అనే పదాన్ని సూచిస్తుంది. అంటే భవిష్యత్తు అని అర్థం. చమురు ఎగుమతులతో ధనిక దేశంగా పేరుగాంచిన సౌదీ అరేబియా 2017లో నియోమ్ కు శ్రీకారం చుట్టింది. ఇదొక సాంకేతిక మాయాజాలంతో కూడిన నగరంగా భావించవచ్చు. గాల్లో ఎగిరే ట్యాక్సీలు, రోబో పనిమనుషులు, నమ్మశక్యం కాని ఆధునికతతో కూడిన ఆకాశ హర్మ్యాలు ఈ భవిష్యత్ నగరంలో కనువిందు చేయనున్నాయి.
ఈ అల్ట్రా స్మార్ట్ సిటీని సౌదీ అరేబియాలోని తబూక్ ప్రావిన్స్ లో 10,200 చదరపు మైళ్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఎర్ర సముద్రం పొడవునా 170 కిలోమీటర్ల మేర ఈ నగరం విస్తరించనుంది. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కలల నగరంగా పేర్కొంటున్న నియోయ్ ను ఎడారిలో స్వర్గంగా భావించవచ్చు. తాజాగా ఈ ప్రాజెక్టు వివరాలను మహ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచం ముందుంచారు. ఈ భూమండలంపై అత్యంత ఆవాసయోగ్యమైన నగరంగా నియోమ్ వర్ధిల్లుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.