ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు లేదా ముఖ్యమంత్రుల కొడుకులు మొదట ప్రత్యక్ష ఎన్నికల్లో (లోక్ సభ లేదా అసెంబ్లీ) గెలిచాకే మంత్రులయ్యారని, కాని ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన ఘనతా ఒక్క లోకేశ్ కే దక్కుతుందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అసెంబ్లీ ఒక్కటే ఉన్న కాలంలో మంత్రి అయిన నందమూరి హరికృష్ణ ఒక్కరే ఈ ఆనవాయితీకి మినహాయింపు అని చెప్పుకోచ్చారు. శాసనసభకు ఎన్నికయ్యాక వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణం చేశారని గుర్తు చేశారు.
టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ బాబు మాత్రం అడ్డదారిలో మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. మొదట 2017 మార్చిలో ఏపీ శాసనమండలికి ఎన్నికయ్యాక లోకేష్ తన తండ్రి కేబినెట్‌లో మంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోతే విలువ ఉండదని 2019 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ తొలిసారి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారని వెల్లడించారు. తన తండ్రి రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిన అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు పర్యటిస్తూ ఎన్నెన్నో పాట్లుపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కారణంగా మంగళగిరి ప్రజలపై లోకేష్‌కు ఇప్పుడు ప్రేమ గుర్తుకోచ్చిందని మండిపడ్డారు. మాజీ హైటెక్ ముఖ్యమంత్రి కుమారుడికి ఓడిన చోటే గెలవాలనే కాంక్ష ఉందని, అది తప్పులేదన్నారు. కాని, ఆయన పర్యటనలో జనం లేకున్నా నీరసపడకుండా కోటలు దాటే వ్యాఖ్యానాలు చేయ్యడం విడ్డురంగా వుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ చినబాబు సాహసంగా ఆయన అభివర్ణించారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల్లో పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి కుమారులు రాష్ట్ర కేబినెట్లలో మంత్రులయ్యారని గుర్తు చేశారు. నాదెండ్ల భాస్కరరావు కొడుకు మొదట అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ తదుపరి స్పీకర్ అయ్యారని చెప్పుకోచ్చారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కొడుకు లోక్‌సభకు ఎన్నికై కొంతకాలం కేంద్ర మంత్రిగా ఉన్నారని అన్నారు. అయితే వారంతా (పీవీ రంగారావు, జలగం ప్రసాదరావు, మర్రి శశిధర్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి) మొదట అసెంబ్లీకి లేదా పార్లమెంటుకు ఎన్నికయ్యాకే మంత్రులయ్యారని పెర్కోన్నారు. వారిలో కొందరు మంత్రులుగా ఉన్న కాలంలో ఏపీ శాసనమండలి ఉనికిలో లేదని చెప్పారు.
ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ట ఒక్కరే అప్పటి ఏకైక చట్టసభ అసెంబ్లీ సభ్వత్వం లేకుండా దాదాపు ఆరు నెలలు తన బావ చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా కొనసాగారని చెప్పారు. ఆరు నెలల్లో హరికృష్ణ అసెంబ్లీకి ఎన్నికయ్యే వీలులేకుండా చేసిన చంద్రబాబు చివరికి బావమరిది రాజీనామా చేసే పరిస్థితులు సృష్టించారని అన్నారు. 1996లో మంత్రి పదవికి రాజీనామా చేశాక హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ మృతితో ఖాళీ అయిన హిందూపురం నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారని చెప్పారు. కానీ ఆయనకు బావ చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని దుయ్యబట్టారు. లోకేష్ మాత్రం అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు ఎన్నికైన నెల రోజులకే తండ్రి కేబినెట్లో చోటు సంపాదించారని ఎద్దేవా చేశారు. 2017–2019 మధ్య రెండేళ్లు చినబాబు సాగించిన నిర్వాకాలు తండ్రి ఘనకార్యాలకు తోడై తెలుగుదేశంను పుట్టి ముంచాయని దుయ్యబట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే ఆత్రంగా మంత్రి అయిన లోకేష్ ముందున్నది రహదారి కాదు ముళ్లదారే అని స్పష్టం చేశారు.