ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ నేత రోజా నాడు మద్యంపై చేసిన వ్యాఖ్యలను తాజాగా టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత్య షేర్ చేశారు. ఇదిలావుంటే ఏపీలో మద్య నిషేధం వ్యవహారంపై రగడ నడుస్తోంది. ఏపీ మంత్రి అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయం హీటెక్కింది. తమ పార్టీ మేనిఫెస్టోలో మద్య నిషేధం అనే పదమే లేదని.. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని మాత్రమే చెప్పామన్నారు మంత్రి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా తమ మేనిఫెస్టో ఉంటుందన్నారు.. కావాలంటే చూసుకోవచ్చని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మద్యం, బార్ పాలసీపై రోజా చేసిన వ్యాఖ్యల్ని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రస్తావించారు. రోజా చెప్పింది నేటికి నిజమయ్యింది అంటూ ఆమె గతంలో మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ‘ఈ రోజు ఏపీలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, చేయడానికి పనిలేదు. కానీ తాగడానికి, తాగినంత మందు ఉంది. మహిళలకు మంచి చేయాలని చిత్తశుద్ది ఏ రోజూ లేదు. మహిళల తాళిబొట్లు తెగినా పర్లేదు. తనకు కమిషన్లు కావాలి, ఖజానాలు నిండాలి అన్న విధంగా ఆయన ఈరోజు ఇలాంటి బార్ పాలసీని అమలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు’ఈ వీడియోను అనిత ట్వీట్ చేసి మండిపడ్డారు.
మరో ట్వీట్‌లో‘మన ప్రభుత్వంలో బెల్ట్ షాప్ ల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మద్యం మీద ఆదాయం దాదాపు మూడు రెట్లు కావడంతో పాటు వైసీపీ నేతలే అడుగడుగునా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నా అడిగే దిక్కు లేదు, చర్యలు శూన్యం. ప్రభుత్వ పెద్దలే టార్గెట్లు విధించి మరీ అమ్మిస్తున్నారు’అన్నారు.
ఇటు టీడీపీ కూడా ట్విట్టర్‌లో మంత్రి అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ‘ఏపీలో జగన్ రెడ్డి మద్య నిషేధం హామీ అటకెక్కినట్టే అని తేలిపోయింది. మరి మహిళల గురించి తెగ ఆరాట పడిపోయే రోజా గారు ఈ విషయంలో ఊరుకుంటారా? ఏంటి... ఆవిడకు అంత సీన్ లేదంటారా? కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోజాగారి ఆవేదన చూడండి. పెర్ఫార్మన్స్ అదిరిపోలా? జగన్ రెడ్డిని మరిపించారు కదా!’అంటూ ట్వీట్ చేశారు.
‘మద్యనిషేధానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మూడేళ్ళ నుంచి ప్రజలను మభ్యపెట్టుకుంటూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు తాజాగా మద్యనిషేధం అన్నది అసలు మా మేనిఫెస్టోలోననే లేదని గట్టిగా చెప్పేసాడు వైసీపీ నేత. మరి ఎలక్షన్ల ముందు జగన్ చెప్పిన మాటల సంగతి ఏంటి? నాటకాలన్నట్టే కదా? మాట తప్పిన నేతకు చెప్పులు, చీపుర్లు చూపించమని జగన్ రెడ్డే సెలవిచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి చూపించాలి? లేక ఇద్దరికీ చూపించాలా? అని అడుగుతున్నారు ఏపీ ప్రజలు’మరో ఘాటు ట్వీట్ చేశారు.