ఇండ్లు గడవాలంటే మహిళల పాత్ర ఎంతో కీలకం. అలాంటి మహిళలకు పెరుగుతున్న ధరలు ఎలా ఆందోళనకు గురిచేస్తున్నాయో మహిళా ఎంపీలు ఏకంగా పార్లమెంటు వేదికగా నరేంద్ర మోడీ సర్కార్ ను నిలదీశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా విపక్షాల పట్టు మేరకు ఎట్టకేలకు ధరల పెరుగుదలపై అధికార పక్షం లోక్ సభలో చర్చకు అంగీకరించిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి సమావేశాల్లో జరిగిన ఈ చర్చల్లో దాదాపుగా అన్ని పార్టీల సభ్యులూ పాలుపంచుకున్నారు. అయితే ఈ చర్చలో పురుష ఎంపీల కంటే కూడా మహిళా ఎంపీలు మాట్లాడిన తీరు, ప్రస్తావించిన అంశాలు దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో పచ్చి కూరగాయలే తినాలా? అంటూ టీఎంసీకి చెందిన మహిళా ఎంపీ కకోలి ఘోష్ లోక్ సభలో వినూత్న నిరసనకు దిగారు. పచ్చి వంకాయను సభలోనే కొరికిన ఆమె గ్యాస్ ధరల పెరుగుదల ఏ మేర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టారు.
సరిగ్గా ఆమె మాదిరే తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమోళి కూడా ఈ చర్చలో చురుగ్గా పాలుపంచుకున్నారు. నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయాయని, ఇది ప్రజలకు మోయలేని భారమేనని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా టమోటా, ఉల్లిగడ్డల ధరలు తగ్గాయి కదా? అంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చెప్పిన మాటను ప్రస్తావించిన కనిమోళి... అయితే ఈ రెంటితోనే రోజూ మూడు పూటలా భోజనం చేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిమోళి నుంచి వినిపించిన ఈ వ్యాఖ్య కూడా ధరల పెరుగుదల ఏ మేర ప్రభావం చూపుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టింది.