హీరోయిన్ ప్రియాంక చోప్రా రష్యా దమన కాండను ఖండిస్తూ ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ప్రకటించిన విషయం తెసిందే. తాజాగా ఆమె ఉక్రెయిన్ శరణార్థులు ఉంటున్న శిబిరాలకు వెళ్లి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఇదిలావుంటే రష్యా సేనల దాడుల ఫలితంగా ఉక్రెయిన్ ప్రజల్లో చాలామంది చెల్లాచెదురయ్యారు. సొంతగడ్డను వదిలి పరాయిదేశాల్లో తలదాచుకుంటున్నారు. పొరుగునే ఉన్న పోలెండ్ దేశంలోనూ ఉక్రెయిన్ ప్రజల కోసం భారీ శరణార్థి శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిలో వేలాదిగా ఉక్రెయిన్ ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
తాజాగా, ఉక్రెయిన్ శరణార్థులను అంతర్జాతీయ తార ప్రియాంక చోప్రా పరామర్శించారు. యునిసెఫ్ సౌహార్ద్ర రాయబారి హోదాలో ఆమె పోలెండ్ సరిహద్దులోని ఉక్రెయిన్ శరణార్ధి శిబిరాలను సందర్శించారు. రష్యా దండయాత్రతో అయినవారిని వదిలి పోలెండ్ చేరుకున్న ఉక్రెయిన్ చిన్నారులను కలిసి వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. వారితో ఆడిపాడారు. అక్కడి శరణార్థుల దయనీయ గాథలు విని ఓ దశలో ఆమె కంటతడిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. తన పోలెండ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు.