గుజరాత్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త వ్యూహాన్ని పదునుపెడుతోంది. ఢిల్లీ వెలుపల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాభవాన్ని పెంచాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ ను చేజిక్కించుకున్న ఆప్... బీజేపీ అగ్రనేతల సొంతగడ్డ గుజరాత్ పైనా కన్నేసింది. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆప్ మరింత దూకుడు కనబరుస్తూ, 10 మంది అభ్యర్థులతో నేడు తొలి జాబితా విడుదల చేసింది. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. త్వరలోనే మలి జాబితాను విడుదల చేసేందుకు ఆప్ ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించి అధికారం కైవసం చేసుకున్న ఆప్, గుజరాత్ లోనూ పటిష్ఠమైన పునాదులు వేసుకోవడంపై దృష్టి సారించింది. నిరుద్యోగులకు నెలసరి రూ.3,000 భత్యం ఇస్తామని ఇప్పటికే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీ ప్రకటించేశారు.
ఆప్ తొలి జాబితాలో 1. భీమా భాయ్ చౌదరి (దేవధర్ నియోజకవర్గం), 2. జగ్మల్ వాలా (సోమ్ నాథ్), 3. అర్జున్ రత్వా (చోటా ఉదయ్ పూర్), 4. సాగర్ రబ్రీ (బేచర్జీ)
5. వశ్రమ్ సగాతియా (రాజ్ కోట్ రూరల్), 6. రామ్ ధదూక్ (కమ్రేజ్), 7. శివలాల్ బరాసియా (రాజ్ కోట్ సౌత్), 8. సుధీర్ వఘానీ (గరియాధర్), 9. రాజేంద్ర సోలంకి (బర్డోలీ), 10. ఓంప్రకాశ్ తివారీ (నరోడా)