ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని విమర్శిస్తే.. ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుని కవరేజ్ ఎక్కువ ఇస్తుందనే ఆత్రంతో బీజేపీ నేత సత్య కుమార్ నోటికొచ్చినట్లు, వ్యక్తిగతంగా మాట్లాడటం దురదృష్టకరం. అమరావతిలో బీజేపీ నేతలు కొందరు పాదయాత్ర చేసి, ఆ ముగింపు సభలో ఆ పార్టీకి చెందిన సత్యకుమార్ అనే వ్యక్తి అసత్య కుమార్ లా, సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఆయన మాటలను వైయస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయనకు సత్యకుమార్ అనే పేరు కంటే.. అసత్యకుమార్ అని పేరు పెట్టుకుంటే బాగుండేది. తాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ సీపీ మద్దతు కోరలేదని వ్యాఖ్యలు చేసి, ఆ పార్టీ అధిష్టానంతో చీవాట్లు తిన్న విషయం అందరికీ తెలుసు. వైయస్ఆర్ జిల్లాలో శుక్రవారం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
టీడీపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి, కేసులకు భయపడి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరికో, సీఎం రమేష్‌కో... సత్యకుమార్ ఎప్పుడూ కొమ్ము కాస్తూ వస్తున్నాడు. వీరంతా కలిసి, చివరికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే "బాబు జనతా పార్టీ" గా మార్చేశారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసే మంచిని, మేం గడప గడపకు వెళ్ళి ధైర్యంగా ప్రజల వద్దకు తీసుకువెళుతుంటే, అది చూసి ఓర్వలేక, అబద్ధాలనే విమర్శనాస్త్రాలుగా చేసుకుని మా మీద నిందలు మోపడం మంచిదికాదు అని ఆయన హెచ్చరించారు.