ప్రధాని రాక సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడం ప్రోటో కాల్ ఉల్లంఘన కాదని ఓ నేటిజన్ వేసిన ప్రశ్నకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానంగా చెప్పారు. ప్రధాన మంత్రి జరిపే వ్యక్తిగత పర్యటనకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధాని తన అధికారిక హోదాలో జరిపే పర్యటనలకు మాత్రమే సీఎంలు హాజరు కావాల్సి ఉంటుందన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత పర్యటనలకు ప్రధాని వచ్చినప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సిన అవసరం కూడా లేదని కేటీఆర్ వెల్లడించారు.
ట్విట్టర్ వేదికగా #ఆస్క్ కేటీఆర్ పేరిట శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా గడచిన 6 నెలల్లో ప్రధాని మోదీ 3 పర్యాయాలు తెలంగాణకు వస్తే సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ స్వాగతమే చెప్పలేదని, ఇది ప్రొటోకాల్ ఉల్లంఘన కాదా? అంటూ కేటీఆర్‌ను ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వెనువెంటనే స్పందించిన కేటీఆర్... తాము ప్రొటోకాల్‌ను పక్కాగా పాటిస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో హిందీని తమపై రుద్దడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.