టీడీపీ నేత కేశినేని నాని ఆ పార్టీకి దూరం కానున్నారా...? స్వయంగా పార్టీ అధినేత పై ఆయన ప్రదర్శించిన తీరు ప్రస్తుతం చర్చాంశనీయంగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన లో విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబుకు ఎయిర్‌పోర్టులో ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించారు. ఈ క్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ గుచ్చాన్ని అధినేతకు అందివ్వాలని ఎంపీ కేశినేని నాని చేతికి ఇవ్వబోయారు. కానీ నాని పుష్పగుచ్చాన్ని విజయవాడ ఎంపీ విసురుగా కొట్టారు. దీంతో నాని తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు నాని చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుపై నేరుగా అసహనం ప్రదర్శించారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నిరాకరించడంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ బతిమిలాడిన ఏమాత్రం పట్టించుకోలేదు.
కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ స్టిక్కర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు నాని ఫిర్యాదు చేశారు. నేరుగా తమ్ముడు చిన్నిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో నాని తమ్ముడు మరింత దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని నాని అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుకకు చంద్రబాబుతో పాటూ లోకేష్‌లు హాజరయ్యారు. అప్పుడు కూడా నాని అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు.. కానీ ఇంతలోనే అధినేత ఢిల్లీ పర్యటనలో జరిగిన ఈ సన్నివేశం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో ఆజాదీ కా అమృతోత్సవ్ నేషసనల్ కమిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాలను కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశానికి చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందడంతో వచ్చారు.
అలాగే మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలనున్నట్లు సమాచారం. సాయంత్రం మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ నేషనల్ కమిటీ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 240 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళుతున్నారు.