ఆధార్ లో మన వివరాలకు సంబంధించి ఏమైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకొనే అవకాశం కూడా కల్పించారు. ఆధార్ నేడు అన్నింటికీ ఆధారమైన గుర్తింపు కార్డు. ఏ ప్రభుత్వ సేవకు అయినా ఇది కావాల్సిందే. అన్నింటికీ కీలకమైన ఆధార్ లో పుట్టిన తేదీ (డేట్ ఆఫ్ బర్త్) తప్పుగా ఉంటే ఏం చేయాలి..? ఆన్ లైన్ లోనే సరి చేసుకోవచ్చు. ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ సరిచేసుకునేందుకు ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలి. ఇది లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇతర ఆధారాలను కూడా సమర్పించొచ్చు. పాస్ పోర్ట్, పాన్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఐండెంటిటీ కార్డు సైతం చెల్లుబాటవుతాయి. డేట్ ఆఫ్ బర్త్ కోసం సమర్పించాల్సిన పూర్తి వివరాలను
https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf ఈ లింక్ కు వెళ్లి తెలుసుకోవచ్చు.
డేట్ ఆఫ్ బర్త్ ను మార్చుకునేందుకు ఆధారంగా జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కనుక దాని సాఫ్ట్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం https://myaadhaar.uidai.gov.in/ పేజీకి వెళ్లాలి. ఆధార్ నంబర్, క్యాపెచా కోడ్ నమోదు చేసిన తర్వాత సబ్ మిట్ కొడితే, అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్రక్రియ పూర్తవుతుంది.
అప్ డేట్ ఆధార్ ఆన్ లైన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, అప్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ కు వెళ్లాలి. పేరు, జెండర్, భాష, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లో ఏది అప్ డేట్ చేసుకోవాలన్న ఆప్షన్లు కనిపిస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడే ఆధారంగా డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేసి సబ్ మిట్ చేస్తే సరిపోతుంది. ఇందుకు రూ.50 చార్జీ చెల్లించాలి. నెల రోజుల్లో అప్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇచ్చిన వివరాలకు, డాక్యుమెంట్ లోని వివరాలకు వ్యత్యాసం ఉంటే రిజెక్ట్ అవుతుంది.
రెండో సారి డేట్ ఆఫ్ బర్త్ లో కరెక్షన్ చేసుకోవాలంటే ఆన్ లైన్ లో సాధ్యపడదు. దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే సమయంలో కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.