వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ నిలబడితే ఆయనను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. పోటీకే ఇక్కడికి వచ్చానని అన్నారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుంపటిగా మారిందని, జగన్ ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని జోస్యం చెప్పారు. వైఎస్సార్పీపీ నాయకులను సాగనంపేందుకు వీలైతే ఇతర పార్టీలను ఏకంచేసి ఇప్పుడున్న 151 నుంచి 15 స్థానాలకే పరిమితం చేస్తామని శపథం చేశారు.
‘‘సీఎం వైఎస్ జగన్.. అమరావతి రైతులు, ప్రజలతోపాటు నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని ఏక వాక్యంతో సంబోధించారు. శనివారం జమ్మలమడుగులో నిర్వహించిన బీజేపీ యువసంఘర్షణ స్కూటర్ ర్యాలీలో ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై విరుచుకుపడిన మాజీ మంత్రి.. తన నోటికి పనిచెప్పారు.
‘‘రాష్ట్రానికి పట్టిన జగన్మోహన్ రెడ్డి దరిద్రం పోవాలి.. వైఎస్ వివేకానందరెడ్డే నా రాజకీయ గురువు .. ఆయనను హత్యచేసింది ఎవరో అందరికీ తెలుసు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఊరపంది.. జగన్‌ను సాగనంపేందుకే ఈ యాత్ర చేపట్టాం’’ అని అన్నారు. వైఎస్ఆర్సీపీ అసమర్థ పాలన గురించి ప్రజలకు తెలియజేయడానికే ఈ సంఘర్షణ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల ముందు యువతకు ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నేడు జాబ్‌లు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. మద్యపానం నిషేధిస్తామని చెప్పి నేడు విచ్చలవిడిగా బార్లుకు అనుమతిలిచ్చారని, పేదలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న ఇళ్లను ఇవ్వకుండా ఇళ్లపట్టాల పంపిణీతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
వారం రోజుల కిందట ‘మనం మన అమరావతి’ పేరిట బీజేపీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చాలా మంది జగన్‌ను రాక్షసుడితో పోలుస్తున్నారని, ఆయన వంద రాక్షసుల కలయికని విమర్శించారు. వంద మంది రాజారెడ్లు కలిస్తే ఒక్క జగన్‌తో సమానమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇకపై భారత రాజ్యాంగం అమలులో లేదని, ఇక్కడ ‘భారతి’ రాజ్యాంగం మాత్రమే అమలులో ఉందని ధ్వజమెత్తారు.