మూడు దశాబ్దాల నాటి ఆయుధ చట్టాల కేసులో ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అతనిని కోర్టు దోషిగా తేల్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక శిక్ష ఖరారుపై విచారణ జరగాల్సి ఉంది. అయితే కోర్టు తీర్పుతో మంత్రి రాకేష్ సచన్ తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తుంది. దాంతో బెయిల్ బాండ్లను అందించకుండా కోర్టు నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలను రాకేష్ సచన్ ఖండించారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని, అయితే ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు.
రాకేష్ సచన్‌ను దోషిగా తేల్చిన తర్వాత కోర్టులో ప్రతివాది లాయర్ రిచా గుప్తా గరిష్ట శిక్ష విధించాలని అభ్యర్థించారు. మంత్రి తరఫున న్యాయవాదులు శిక్ష ఖరారు చేయడంపై వాదనల కోసం సమయం కోరారు. అయితే కోర్టు సమయం ఇవ్వడానికి నిరాకరించింది. ఇంతలో జ్యుడిషియల్ అధికారులు ఛాంబర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి కోర్టు నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాకేశ్ సచన్‌పై శనివారం రాత్రి కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాన్పూర్ జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీకి ఫిర్యాదు అందినట్టు తెలుస్తుంది. ఈ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని వెల్లడించారు.
1991 నాటి కేసు...
కాగా నౌబస్తా ఎస్‌వో బ్రిజ్‌మోహన్ ఉద్నియా ఆగస్ట్ 13, 1991న రాకేష్ సచన్‌పై కేసు పెట్టారు. రాకేష్ సచన్ దగ్గర అతని బంధువు రైఫిల్ దొరికింది. రాకేష్ అక్కడికక్కడే లైసెన్స్ చూపించలేకపోయారు. ఈ కేసులో పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రాకేశ్ సచన్ 1993 నుంచి 2002 వరకు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఘాటంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఫతేపూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు. భోగ్నిపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.