మణిపూర్ రాష్ట్రం ఆందోళనలతో మండిపోతోంది. ఆ రాష్ట్రంలో రెండు నెలల పాటు 144 సెక్షన్‌ను విధించారంటే పరిస్థితి ఎందాక పోయిందో అర్థంచేసుకోవచ్చు. మణిపూర్ అట్టుడుకుతుంది. గిరిజన విద్యార్థుల నిరసన ప్రదర్శనలతో హోరెత్తుతుంది. ఈ నేపథ్యంలో ఫౌగాక్‌చావో దగ్గర నలుగురు వ్యక్తులు ఒక వాహనాన్ని తగులబెట్టారు. అయితే ఈ ఘటన ఇఖాంగ్‌లో మతపరమైన ఉద్రిక్తలకు దారి తీసిందని రాష్ట్ర హోంశాఖ పేర్కొంది. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు డేటా సేవలను నిలిపివేశారు. అలాగే చురాచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల్లో రాబోయే రెండు నెలల పాటు 144 సెక్షన్‌ను విధించారు.
"శనివారం సాయంత్రం టీడీమ్ రోడ్ ఎన్ హెచ్-02 దగ్గర ప్జౌగాక్చో ఇకాయ్ అవాంగ్ లైకే దగ్గర ఒక సంఘటన జరిగింది. ఓ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు, నలుగురు యువకులు ఒక వాహనానికి నిప్పంటించారు. నేరం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తమైన మతపరమైన పరిస్థితులు తలెత్తాయి. అస్థిర శాంతిభద్రతలను సృష్టించారు." అని మణిపూర్ హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.
అంతేకాదు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ఫోటోలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను విస్తృతంగా ప్రసారం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా పుకార్లకు ఉపయోగపడే సాధనంగా మారింది, సాధారణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగించబడుతోందని రాస్ట్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరిణామం శాంతిభద్రతలపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రాబోయే ఐదు రోజుల పాటు ఇంటర్ నెట్, డేటా సేవలను నిలిపివేస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే కొన్నిరోజులుగా మణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘం ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రహదారులపై నిరసనలు, బంద్‌లు సాగుతున్నాయి. నిజానికి మణిపూర్ (కొండ ప్రాంతాలు) అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్లు, 2021ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. గతేడాది రూపొందించిన ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఏర్పడుతుంది. అందుకే ఈ బిల్లు కోసం గిరిజన విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి.
సవరణ బిల్లు...
అయితే రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ (కొండ ప్రాంతాలు) జిల్లా కౌన్సిల్ ఆరో, ఏడో సవరణ బిల్లులను మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే అవి నిరసనకారులు తమ డిమాండ్‌లకు అనుగుణంగా లేదని గిరిజన విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. తమతో సంప్రదింపులు జరిపి రూపొందించి మరో బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్రంలోని ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నారు.
నిరసనలు.. ర్యాలీలు..
ఈ నేపథ్యంలో శనివారం ఇంఫాల్‌లో నిరసనల ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో 30 మంది గిరిజన విద్యార్థులు గాయపడ్డారు. ఐదుగురు గిరిజన విద్యార్థి నాయకులను అరెస్టు చేసి 15 రోజుల పాటు జైలుకు పంపించారు. దీంతో తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరజిన విద్యార్థుల సంఘం ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ రహదారులను బ్లాక్ చేశారు. ఈ క్రమంలో హైవేలపై కొన్ని వాహనాలను తగలబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి.