వృద్ధురాలిని చంపుతానని బెదిరించి ఆమెపై దాడిచేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లా పర్చూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఓ కాలనీకి చెందిన వృద్ధురాలు (55) శనివారం రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన పిల్లి నాగేంద్రబాబు అలియాస్ మోజెస్ లోపలికి ప్రవేశించాడు. ఆమెకు స్ర్కూడ్రైవర్ చూపించి చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు ఇంటిలో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఎ.లక్ష్మీభవానీ ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
విషయం తెలుసుకున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, మార్టూరు సీఐ ఆంజనేయరెడ్డి బాధితురాలి నివాసానికి చేరుకుని చట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడిని పోలీసులు ఆదివారం అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా.. నాగేంద్రబాబు గతేడాది జూలై 15న చీరాలకు చెందిన ఓ వృద్ధురాలిని ఇంటికి వెళ్తుండగా ఆటోలో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి రిమాండ్లో ఉన్న నాగేంద్రబాబు ఈ ఏడాది మార్చిలో బెయిల్పై బయటకు వచ్చాడు. నిందితుడిపై పర్చూరు పోలీసుస్టేషన్లో రౌడీ షీట్ ఉందని పోలీసులు తెలిపారు.