దేనికైనా సంయమనం అవసరం. అలా కాకుండా ఆవేశాలకు వెళ్లితే మన ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జరుగుతుంటాయి. అనేక ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఒక చోట చేరి.. ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న గొడవలు, ఘర్షణలు కూడా చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి గొడవకు దారితీసే అంశాలు చాలా చిన్నవిగానే ఉంటాయి. కానీ పెద్దస్థాయికి వెళ్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక చిన్న అంశంలో వాగ్వాదం జరిగి.. ఏకంగా ఓ వ్యక్తిని కదులుతున్న రైల్లోంచి తోసేశారు. ఈ అనూహ్యమైన ఘటనకు.. మిగతా ప్రయాణికులు బిత్తరపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని లలిత్‌పూర్ జిల్లాలో రైల్వే ప్యాంట్రీ సిబ్బంది ఒక వ్యక్తిపై దాడి చేసి కదులుతున్న రైలులోంచి బయటకు తోసేశారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. రవి యాదవ్ (26) అనే వ్యక్తి శనివారం తన సోదరితో కలసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ (12591)లో ప్రయాణించాడు. అయితే రైలు జిరోలి గ్రామ సమీపంలోకి చేరుకున్నప్పుడు.. వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అలాగే పాన్ మసాలాను ఉమ్మి వేశాడు. ఈ విషయంపై అతనికి ప్యాంట్రీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ వాగ్వాదం కాస్తా పెరిగింది. కోపోద్రిక్తులైన ప్యాంట్రీ సిబ్బంది అతనిని కొట్టి, కదులుతున్న రైల్లోంచి రవిని ట్రాక్‌పైకి విసిరేశారు. అక్కడి నుంచి స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్యాంట్రీ సిబ్బందిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 323, 325, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు ప్రభుత్వ రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ మహ్మద్ నయీమ్ తెలిపారు. ఒకరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అలాగే ఒకరిని అరెస్ట్ చేశారు.