కొందరు ఇళ్లు, బంగ్లాలు కొనేటప్పుడు ఎదో ఒక ప్రత్యేకత కలిగిన వాటిని కొన్నాలని తహతహలాడుతుంటారు. అలాంటి వారికి వచ్చిందో సదవకాశం. ఎక్కడైనా మనకంటూ సొంత స్థలం ఉండటం గొప్పే.. అదీ సముద్రం మధ్యలో మన కంటూ ప్రత్యేకంగా ఓ దీవి ఉంటే..? చాలా మందికి ఇలాంటి కలలు ఉంటాయి. అలాంటి కలలు తీర్చుకునేందుకు, మరీ పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఓ దీవిని సొంతం చేసుకునేందుకు ఓ అవకాశం వచ్చింది. యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలోని స్కాట్లాండ్ సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్న ప్లాడ్డా దీవి అమ్మకానికి వచ్చింది. ధర కూడా సుమారు రూ.3.5 కోట్లు (3.5 లక్షల పౌండ్లు) మాత్రమే. దాని ప్రస్తుత యజమానులు 1990లో ఈ దీవులను కొనుక్కున్నారని.. వారి వారసులు ప్రస్తుతం అమ్మకానికి పెట్టారని యూకెకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది.
నీటి బొట్టు ఆకృతిలో..
స్కాట్లాండ్ సముద్ర తీరంలో అర్రన్ ద్వీపానికి కిలోమీటర్ దూరంలో సముద్రంలో ప్లాడ్డా దీవి ఉంది. నీటి బిందువు ఆకృతిలో ఉన్న ఈ ద్వీపం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో ఒక లైట్ హౌజ్ తో కూడిన పెద్ద ఇల్లు, మరో చిన్న ఇల్లు, ఒక బోట్ హౌజ్ ఉన్నాయి. ఒక హెలిప్యాడ్, ట్రాక్టర్ షెడ్ కూడా ఉన్నట్టు అమ్మకపు సంస్థ తెలిపింది. పెద్ద ఇంటి పక్కన రెండున్నర ఎకరాల్లో తోటలు ఉన్నాయని.. గతంలో అక్కడ పండ్లు, కూరగాయలు పండించారని వివరించింది. పెద్ద ఇంట్లో ఐదు బెడ్రూంలు, రెండు హాళ్లు, ఒక కిచెన్ కం డైనింగ్ రూమ్ ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా దీవిలోని ఇళ్లను వినియోగించడం లేదని.. వాటిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏమైనా సరుకులు కావాలంటే.. దగ్గరిలోని సిల్వర్ శాండ్స్ బీచ్, దాని పక్కన ఉన్న కిల్డోనాన్ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. వాటిని చేరుకునేందుకు 15 నిమిషాల పాటు బోటులో ప్రయాణించాల్సి ఉంటుందని వివరించింది. డాల్ఫిన్లు, సీల్స్ వంటి చాలా రకాల సముద్ర జీవులు, పక్షులకు ప్లాడ్డా దీవి నిలయమని.. సమీపంలో మరికొన్ని పెద్ద దీవులూ ఉన్నాయని వివరించింది.