ఆంగ్లేయులంటే మొదటి నుంచీ గిట్టని రసూలాఖాన్ ఉత్తర భారతదేశంలో సయ్యద్ బరేలీ ఆధ్వర్యంలో ప్రారంభమైన 'వహాబీ' ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. వహాబీ ఉద్యమం ఉద్దేశం మన ప్రాంతాలను మనమే పాలించుకోవాలి. మన రాజ్యాన్ని మనమే పాలించుకోవాలి. కర్నూలు శివారుకు చేరుకున్న ఎ. బి. డైస్ కర్నూలు కోటను ఖాళీ చేసి, తమకు లొంగిపోవాలని గులాం రసూల్ ఖాన్ కు వర్తమానం పంపించాడు.
అయితే గులాం రసూలాఖాన్ బ్రిటీషు వారికి వెన్ను చూపకుండా ఉన్న కొద్దిపాటి సైన్యంతో బ్రిటీషు వారిపై తలపడ్డాడు. ఈ పోరు ఆరు రోజులు కొనసాగి 1839 అక్టోబరు 18న ముగిసింది. తన సైన్యమంతా హతం కాగా, రసూల్ ఖాన్ ను చుట్టుముట్టి బ్రిటీషు సైన్యం ఆయన్ను నిర్భందించింది. విచారణ ఖైదీగా ఆయన్ను తిరుచునాపల్లి కారాగారానికి తరలించింది.
తిరుచునాపల్లి కారాగారంలో ఉన్న రసూల్ ఖాన్ ను వెంటనే చంపేస్తే కర్నూలు ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని భావించిన బ్రిటీషు వారు విచారణ పేరుతో కొన్నాళ్లు కారాగారంలోనే ఆయన్ను ఖైదీగా ఉంచారు. నవాబు వ్యక్తిగత సహాయకుడ్ని లోబర్చుకొని ఆయనకు విషాహారం పెట్టించగా 1840 సంవత్సరం జూలై 12న రసూలాఖాన్ మరణించారు.